ఈ మధ్య వరుసగా వస్తున్న సంవత్సరీకాల వార్తలు కిందటి సంవత్సరపు బాధ అంతా గుర్తుకు వచ్చింది . ఇలాంటి వార్తలు విన్నప్పుడు నాకు గుర్తుకు వచ్చే పాట ఇది .
ఈ పాట రజని గారి దేవదాసు నృత్య నాటకం లొనిది . నేను చాలా రోజులు అది చండిదాసు లోది అనుకున్నాను . ఎందుకలా ? అంటే మామయ్యగారి తో కబుర్లల్లో అదలా గుర్తు ఉంది . ఇవ్వాళ మళ్ళీ చూస్తే కాదని తేలిపోయింది . రజని గారికి ఇష్టమైన నాటకం చండీదాసు .
దేవదాసు నాటకమైన సరే మనిషికి ప్రతీది నెగటివ్ గా చూస్తే అది అలాగే కనపడుతుంది . ప్రతీదీ పాజిటివ్ గా చూసే రజని గారికి దేవదాసు పాటలోని నిరుత్సాహం లో కూడా ఎందుకో ఆశ ఉంటుంది అని అనిపిస్తుంది .
ముందు పాట
మరు నిముసము మనదో కాదో
మదు వానవో మధుపా ! మధుపా !
వడ గాలిని వాడునో యేమో
జడి వానను రాలునో యేమో !
తొంగలి రెప్పల చెంగల్వ పువ్వే
తొంగి చూచె నదిగో కన్నావే
రేపనీ మాపని చూడకుమోయ్
రెప్ప పాటు మాత్రమే యీ బ్రదుకోయి !
ఇదీ పాట . ముందు వాక్యం తేలికగా అర్థం అవుతుంది . మధు వానవో -- అది తేనె వర్షం కాదు . ఆనవో అంటే తాగు , తాకు అనే అర్థం .
మధు పా ! = భ్రమరం ! తేనేటీగ
వడ గాలిలో -- ఎండ కాలపు వేడి గాలి
తొంగలి -- వాలుట . చెంగల్వ పువ్వు మొగ్గ రెప్పలు వాలినట్లు ఉన్నాయని అర్థం .
అది అప్పుడే విచ్చుకుంటొంది అని అర్థం . కాని దాని కి మరు నిమిషం లో ఏమవుతుందో తెలియదు కదా ! అది వడగాలికి వాడ వచ్చు , జడి వానలో నేల రాలి పొవచ్చు . రెప్ప పాటు మాత్రమే ఈ బ్రతుకు .
అందుకే రేపని , మాపని ఎదురు చూడవద్దు . మరు నిముసము మనదో కాదో !
దేవదాసు మానసిక స్థితి కి అద్దం పడుతుంది ఈ పాట . అంతే కాక జీవన సత్యం కూడా ఇందులో ఉంది . మనం గమనించవలసింది , ఈ పాట రాసింది 1940 లో . అంటే అప్పటికి రజని గారి వయసు 20 సంవత్సరాలు .
ఇక రజనీ గారికి సాహిత్యము , సంగీతము వేరే కాదు . ఈ పాట లో ' తొంగలి రెప్పల ' అనే మాటల మధ్యలో చిన్న తీగ మీటు ఉంటుంది . అది ఆ రెప్పలు వాలడానికి సంకేతంగా వాడానని రజని గారు చెప్పేవారు . అది ఆ వయస్సులో . అయితే ఈ ప్రయోగాలన్నిటికి అప్పటి బెంగాలి సంగీతం ప్రభావం ఉందనే చెప్పాలి .
ఈ పాట లోని ఆ వేదాంతాన్ని మనస్సులో ఉన్నది ఉన్నట్లు గొంతులో పలికించారు వోలేటి గారు . ఆ మహామహులందరిని గుర్తు తెచ్చుకుంటూ ఈ పాట