అమెరికా కబుర్లు -5
ఈ రోజు Rock Creek Park కి వెళ్ళాము. ఇది చాలా పెద్ద పార్క్ . పార్క్ అనేకంటే చిన్న అడవి. ఊరి మధ్యలో వుంది . పెద్ద చెట్లు , చిన్న సెలయేరు , రోడ్డు . నడవడానికి చాలా బాగుంది . మాలాగానే ఎంతో మంది పిల్లలు , పెద్దలు వచ్చారు. నడిచే వాళ్ళు , సైకిల్ తొక్కేవాళ్ళు , జాగింగ్ చేసే వాళ్ళు .
ఈ జాగింగ్ గురించి తమాషా విషయం చెప్పాడు మా అబ్బాయి . అమెరికాలో ఏ సమయం లో చూసినా ఎవరో ఒకరు జాగ్ చేస్తూ కనిపిస్తారుట. అది అర్ధరాత్రి అయినా , తెల్లవారు జామైనా , మిట్ట మధ్యాహ్నమైనా , చలైనా , వానైనా , ఎండైనా జాగ్ చేస్తూ వుంటారుట. సోమవారం పొద్దున్న కూడా కనపడతారు - అసలు వీళ్ళకి ఆఫిసులు , పని వుంటుందో వుండదో అర్ధం కాదు అని .
ఎందుకలా అంటే హెల్త్ కానష్సనెస్ ట. తినేటప్పుడు కన్వీనియన్స్ , తరువాత జాగింగ్ .. ఏమిటో !
సరే - రాక్ క్రీక్ పార్కు దాదాపు 1800 ఎకరాల పార్క్ ట . నడవడం చాలా హాయిగా వుంది . ఎంత పెద్ద చెట్లో ! ఏదైనా ఇలా వూరి మధ్యలో ఇలా పచ్చదనం వుండడం , అవి వూరికి ఆక్సిజన్ ఐలెండ్స్ లా పని చేస్తాయి. ప్రశాంతంగా పిట్టల కూతలు వింటూ నడవవచ్చు .
మధ్యాహ్నం 2.00 కి వాన వస్తుందని హడావిడిగా వచ్చాం. ఖచ్చితంగా 2.00 కాగానే వాన వచ్చింది ' ఓరినీ ! అమెరికా వాడు వానని కూడా టైం ప్రకారం రమ్మంటాడే ! '. మనూళ్ళో వెదర్ రిపోర్టు వాన అంటే ఎండ కాస్తుంది
. ఈ మధ్య నయమే ! అయితే ధండర్ స్ట్రాం అన్నాడు కాని ఒక అరగంట కురిసి ఆగి పోయింది. నేను హమ్మయ్య అనుకున్నాను . వాన ఆగినందుకు కాదు, అమెరికా వాడు చెప్పినట్లు జరగనందుకు.



