కాశీ యాత్ర -౬
శంభో మహాదేవ ! హర హర శంకరా !
పొద్దున్నే నాలుగింటికి లేచి రెడీ అయ్యి నాలుగున్నరకల్లా విశ్వనాధ గుడికి చేరాము . ముందే దిలీప్ ఏర్పాటు చేసినట్లు ఒక షాప్ దగ్గర దింపాడు . గుడి కి దగ్గరగా ఉంది . అక్కడ మా బాగులు , ఫోనులు అన్నీ డిపాజిట్ చేసాము . లోపల పూజకు కావల్సిన పూల తట్ట ఇచ్చారు . టికెట్ కి ఒక వంద రూపాయులు కలిపి తీసుకున్నారు . అంటే మనం టికెట్ ఆన్ లైన్ లో తీసుకోవచ్చు . 350/- . అయితే అది ఒక రెండు రోజులు ముందే ఇస్తారు . మరీ ముందు దొరకవు , ఆలస్యంగానూ దొరకవు . మేము అది చెయ్యలేదు కనుక ఒక వంద రూపాయులు ఎక్కువ . ఇక అక్కడ నుంచి ఒక పుజారి కి అప్పజెప్పారు . ఆయనకి కొంచం తెలుగు వచ్చు . అన్నట్లు డబ్బులు ఉన్న పర్సు దగ్గర పెట్టుకోవాలి . ఇంక గుడిలోకి వెళ్ళిన దగ్గర నుండి ఆ పూజారి ' అమ్మా , కొంగులు కప్పుకొండి , మీ గొలుసులు లాగేస్తారు , పర్సులు జాగ్రత్తా ' అంటూ హెచ్చరిస్తూనే వున్నాడు . అదే తెలిసి వుంటే గొలుసులు లేకుండానే వెళ్ళే వాళ్ళం కదా అనుకున్నాము . పక్కన ఎవరు అన్న టెన్షన్ ఉండదు .
ఇక అక్కడ ఉన్న మరో పూజారికి అప్పజెప్పాడు . అతను మీరు ఎన్ని లీటర్లు అభిషేకం ? ఒకటా ? అయిదా ? అని . నేను ఏమీ ఆలొచించకుండా అయిదు అన్నాను . అయిదు లీటర్లు పాలు . ఎక్కడో చదివాను -- ఆ శివుడికి పాల తో అభిషేకం చేస్తే మంచి గొంతు వచ్చి చక్కగా పాడగలుగుతారుట ! నాకు తీరని కోరికలలో అది ఒకటి . హాయిగా నాకు నచ్చేలా పాడుకోవడం . అందుకే ఏమి తడుముకోకుండా అయిదు అన్నాను . ఇవన్ని ఏక పక్ష నిర్ణయాలు . పక్కనే ఉన్న ప్రసాద్ గారిని , భార్గవిని అడగలేదు . పాపం , వారు ఏమీ మాట్లాడలేదు . పాలకి డబ్బులు . అక్కడ నుండి మొదలు -- అన్నీ అయిదు వందల కాగితాలే తీయడం , ఇవ్వడం .
గుడి చాలా బాగుంది . మోడి , యోగి గారి ప్రభుత్వ నేతృత్వం లో విశ్వనాధ కారిడార్ అని ఆ గుడిని విశాలం గా చేసారు . అంతకు ముందు ఒక సారి వచ్చిన ప్రసాద్ గారు చాలా మారిపోయింది అని చెప్పారు . అదీ కాలభైరవుని గుడిలాగా చిన్నదిగా ఉండేదిట . నేను చదివిన అన్ని పుస్తకాలలో అలాగే రాసి ఉంది . పక్కనే గోడ కి ఆనుకుని పెద్ద mosque ఉండేదిట . ఇప్పుడు ఆ మసీదుకి గుడి కీ దూరం ఉంది . విశాలంగా , తెల్లవారు జామున ప్రశాంతతో చాలా హాయిగా ఉంది . అప్పటికే జనం ఉన్నారు . అసలు లింగం పక్కన చిన్న మండపం లో నాలుగు లింగాలు వరుసగా ఉన్నాయి . అభిషేకం చేసేది వాటికి . ముందు కూర్చుని వారిది అయిపోగానే మేము కూర్చున్నాము .
బకెట్ నిండా పాలు కలిపిన నీళ్ళూ , గంధం , తేనే , విభూది , ఇలా అన్ని చిన్న పాత్రలతో పట్టుకు వచ్చి అభిషేకం చెయ్యించారు . చాలా తృప్తిగా అనిపించింది . నాకైతే అదే విశ్వనాధుడు ! అసలు మూల విరాట్టు దూరం నుంచి చూడడమే కదా ! ఈయనకే విశ్వనాధుడని మనసార నమస్కారం చేసుకున్నాము . అక్కడి వారు చిన్న చెంబులలో నీరు తెచ్చి అలా కొంచం ఆ నాలుగు లింగాల మీద పోసి హర హరా అనుకుంటూ వెళ్తూ ఉంటే ఆ దేవాలయం అంతా విశ్వనాధుడే .పూజ అవగానే మాకు చేతికి కాశీ దారం కట్టాడు . కాశీ దారం మాకు తెలిసి నల్లగా ఉంటుంది కదా ! ఈయన ఎర్ర దారం కట్టాడు . రూల్స్ మారి పోయాయేమో !
అక్కడ నుంచి విశ్వనాధ దర్శనం . ఇక్కడ మాకు పక్క నుంచి క్యూ లో కలిపి పంపారు . ఇదేదో మా మీద అభిమానం కాదండి . ఒక్కో గ్రూప్ కి ఇంత టైం అని పెట్టుకుంటారు . ఆ టైం లో గబాగబా చూపించి బయటకు తీసుకుని వెళ్తేనే వారికి ఉపయోగం . వారి నెట్ వర్క్ అక్కడున్న పూజారులతోను , పోలీసులతోనూ ఉంటుంది . అదే వారి సంపాదన మార్గం .
దర్శనం చేసుకుని ఆ పక్కకు వెళితే వినాయకుడు . మమ్మల్ని లోపలకి తీసుకుని వెళ్ళిన పూజారికి ఒకటే మంత్రం వచ్చు . ( అని మేము అనుకున్నాము ). అది చదివి వినాయకుడి దణ్ణం పెట్టించి అక్కడ తీర్థం తీసుకోని ఆ బ్రాహ్మడుకి వంద రూపాయులు ఇమ్మన్నాడు .
అక్కడ ఒక బావి ఉంది . ముందు ఉన్న లింగం ఔరంగ జేబ్ దాడి చేసి నప్పుడు ఒక పూజారి అది బావి లో పడేసారుట . అది లుప్త మయిపోయింది . అక్కడ నంది అటు వేపు తిరిగి వుంటాడు . ఎందుకంటే పూర్వమున్న లింగం అక్కడ ఉండేది . ఇప్పుడు అక్కడ ఒక మసీదు ఉంది .
నిజానికి ఈ గుడి చాలా సార్లు దాడికి గురి అయ్యింది . 1194 లో కుతుబుద్దిన్ ఐబక్ , నాశనం చేసిన గుడిని Iltutmush కాలంలో ఒక గుజరాతి వర్తకుడు తిరిగి కట్టారు . మళ్ళీ శికందర్ లోడి దాడి చేసారు . 1585 లో రాజ్ మాన్ సింగ్ అది ముందు ఉన్న ప్రదేశం లో కడితే పూజారులు అందులోకి వెళ్ళడానికి ఒప్పుకోలేదుట . ఎందుకంటే మాన్ సింగ్ కూతురు ఒక ముస్లిం ని పెళ్ళి చేసుకుందని . మళ్ళీజహంగీర్ కాలంలో తిరిగి కట్టారు . 1669 లొ ఔరంగ జేబ్ గ్యాన్ వాపి మసీదు కట్టడం తో మరో సారి దాడికి గురి అయ్యింది . అప్పుడే ఆ లింగాన్ని బావిలో పడేయడం .
ఇప్పుడు ఉన్న గుడి తరువాత ఇండోర్ మహారాణి అహల్యాబాయి హోల్కర్ 1780 లో కట్టించారు .ఆ శివ లింగం కూడా ఇండోర్ నుండి తెచ్చారుట . భారత దేశం లోని చిన్నా , పెద్దా రాజులు అందరూ ఈ గుడి కోసం విరాళాలు ఇచ్చారుట .
కాని మనకి ఆ శివుడు ఎప్పటినుండో ఉన్న ఆది శంకరుడే . ఆ భావనే దాన్ని జ్యోతిర్లింగం చేసింది .
అక్కడ నుండి వెనక వైపుగా విశాలాక్షి గుడికి తీసుకుని వెళ్ళాడు . మీరు బయటకు వెళ్ళి ఈ గుడికి రావలంటే అరగంట పడుతుంది అని వారికే తెలిసిన సందుల్లో నుంచి తీసుకుని వెళ్ళాడు .
మనకు దక్షిణ భారతం లో అయ్య వారికి ఎంత ప్రాముఖ్యత ఉందో అమ్మ వారికి ఒక ఆకు ఎక్కువే ! అమ్మలగన్న అమ్మ కదా ! ఇక్కడ అలా కాదు . అదో చిన్న ఇల్లు లా ఉంది . పాత కాలం చువ్వలుండే తలుపులున్న ఇల్లు . లోపలకి వెళితే అమ్మ వారు . మా పేరు మీద పూజ చెయ్యించి జాకెట్టు ముక్కలు , గాజులు ఇప్పించాడు .
అక్కడ నుండి చక చకా నడిపించుకుంటూ అన్న పూర్ణ దేవాలయం కి వెళ్ళాము . కాశీ అన్నపూర్ణ ! దణ్ణం పెట్టుకుని బియ్యం ప్రసాదం తీసుకున్నాము . నిజానికి అక్కడ ఒక పూట భో జనం అనుకున్నాము కాని మళ్ళీ అక్కడకి రావడం కష్టం అని అర్థం అయ్యింది . రమా శాండిల్యా గారు అన్నట్లు ఆ పక్కన ఉన్న లాడ్జీలలో ఉంటేనే అది సాధ్యం . ప్రాప్తం లేదు .
అన్ని చూసి బయటకు వచ్చి తిరిగి ఆ షాప్ కివచ్చి టైం చూసుకుంటే ఏడు . అప్పటికి గుడి దగ్గర జనం కూడా ఎక్కువ అయ్యారు .మమ్మల్ని లోపలకు తీసుకుని వెళ్ళిన పూజరి 10000/- నుండి మొదలు పెట్టి 2500/- సరి పెట్టుకుని వెళ్ళాడు . అక్కడ ఒక చిన్న శివలింగం కొన్నాను . మాకు తెలిసిన వారు అడిగారు . ఇంకా ఏమైనా కొందామని అన్నా అన్ని స్పెన్సర్ రేట్లు . దిలీప్ అప్పటికి ఆ పూజరితో గొడవ పడ్డాడు . వాళ్ళు ఇచ్చింది తీసుకోవాలి కాని అలా డిమాండ్ చెయ్యడమేమిటి అని . అతనంతే ప్రశాంతంగా నా సంపాదన ఇదే కదా అంటు వేరే పార్టిని గుడికి తీసుకుని వెళ్ళే ప్రయత్నం లో పడ్డాడు .
మేము మెల్లగా బయట పడ్డాము . అక్కడే ఆ కారు దిగుతూ ఉంటేనే నిమ్మి కాలు మెలి దిరిగి స్ప్రైన్ అయ్యింది . తను ఏమి చెప్ప లేదు . తరువాత దాని ప్రభావం తెలిసింది . రూం కి చేరే సరికి పాదం వాచింది .
మళ్ళీ హోటల్ కి చేరి కాస్త తిని రెస్టు తీసుకుని షాపింగ్ కి వెళ్ళాము . అదే ఆ పొద్దు సరిపోయింది . సాయం కాలం నాలిగింటికి సారనాధ్ అనుకున్నాము . ఈ లోపు ఇక్కడి భోజనం చెయ్యాలని అనుకున్నాము . చిన వీరభద్రుడి గారి పుస్తకం లో రాసారు - బాటి చోకా కి వెళ్ళాము . కింద కూర్చో గలిగే వారికి కిందా లేదంటే కుర్చీలు వేస్తారు , విస్తరాకులో భోజనం , చోకా అంటే మన బోండాం లా ఉంది . దానితో వంకాయ బజ్జి , పల్చటి పప్పు , గట్టి పెరుగు , పుదినా పచ్చడితో అన్నం . దానితో ఖీర్ . భోజనం బాగుంది . ఒకటి కంటే ఎక్కువ తినలేము . ambience చాలా బాగుంది . జనం అలా వస్తూనే ఉన్నారు . అది తిని ప్రసాద్ గారు తెచ్చిన బనారస్ పాన్ వేసుకుని రూం చేరాము .