నా కాశీ యాత్ర -8
ఇంక మిగిలింది అస్సీ ఘాట్ . అది చూడాలి అని మళ్ళీ పొద్దున్నే లేచి అయిదింటికల్లా అస్సీ ఘాట్ చేరాము . అసలు వీలైతే గంగా స్నానం , పెద్దలకు అర్ఘ్యం అనుకున్నాము . కాని అక్కడకి చేరే సరికి పొద్దున్న హరతికి సన్నాహాలు జరుగుతున్నాయి . ఒక సంస్థ వారు ( ఏ సంస్థో తెలియలేదు ) పిల్లలని తీసుకుని వచ్చారు . పొదున్నే ఆ ఘాట్ల మెట్ల మీద కూర్చుని పిల్లలు పాడిన స్త్రోత్రాలు విన్నాము . తెలి సంధ్య కాంతులు ఇంకా పూర్తిగా పట్టణాన్ని మేలుకొలపలేదు కాని ఘాట్ దగ్గర సందడే సందడి .
ఒక గంట అక్కడ కూర్చుని స్నానానికి కేదార్ ఘాట్ వీలని దిలీప్ మాట మీద మళ్ళీ అటు వెళ్ళాము . అయితే భార్గవి మళ్ళీ ఆ మెట్లు దిగలేనంది . నిమ్మి మాత్రం ప్రసాద్ గారు వద్దులే అన్నా వెళ్ళింది . మేము కారులొనే కూర్చున్నాము . ప్రసాద్ గారు గంగా స్నానం చేసి , పోయిన వారందరి పేరు మీద పూజలు చేసారు . తెలుగు బ్రాహ్మణులు దొరకలేదండి , ఒక ఉత్తర భారతీయ పూజరి గారి నిర్వహణలో పూర్తి చేసాను అన్నారు . నిజానికి అది ఆయన 25 వ తారీకు , హేమచంద్ర పుట్టిన రోజు నాడు చెయ్యాలి అనుకున్నారు కాని అలా ముందు అనుకోలేదు కనుక కుదరలేదు . బహుశా నా మనస్సులో ఎక్కడొ రెండూ ఒక రోజు అని ఇష్ట పడ లేదేమో ?! మా స్నానానికని చిన్న బాటిల్స్ లో నీరు పట్టుకొచ్చారు .
మేము రూము కి వచ్చి 'గంగా ' స్నానం చేసాము . ఇక అక్కడ నుండి షాపింగ్ . ఆదివారం . ఒక్క షాప్ దొరికింది . పాపం ఆ షాపు లోని వ్యక్తి , మేము కాసేపు హిందీ లో కుస్తీ పట్టాక ఇంక లాభము లేదని తెలుగు వచ్చిన వ్యక్తిని పంపాడు . ఆయన విజయనగరం అన్నాడు . భార్గవి రాసినట్లు కడప దగ్గర విజయనగరం అయ్యి వుంటుంది . ఒక జీవిత సత్యం చెప్పాడు -" కాశీ విశ్వనాధుడు అక్కడ , బెజవాడ కనకదుర్గమ్మ ఇక్కడ దొరకరు ; మిగతావన్ని అన్ని చోట్ల దొరుకుతాయి . మీకు ఇక్కడేమి స్పెషల్ ఉండవు "అని . ఇంకెందుకూ అని రెండు బ్లౌజ్ ముక్కలు కొని , ఒక చీర తీసుకుని బయట పడ్డాము .
ఇంక మిగిలింది రాం నగర్ ఫొర్ట్ . సరే నని మధ్యాహ్నం అటు వెళ్ళాము . అదీ పెద్ద కోట . కాశీ రాజు గారి నివాసం . ఇప్పటి కాశీ రాజు అక్కడ ఉంటారుట . బ్రిడ్జి దాటి వెళ్ళాలి . గంగ ఆవల ఒడ్డున ఉంది . బ్రిడ్జి నుంచి చూస్తే భలే అందంగా ఉంది . గంగ ఒడ్డు. వరద వచ్చిన మునగకుండా ఎత్తులో కట్టారు . ఇప్పటి రాజు పేరు అనంత్ నారయణ్ సింగ్ ట . ఈ కోట వారణాసి నుండి 14 కిలోమీటర్లు దూరం లో ఉంది . అయితే BHU కి దగ్గర . రెండు కిలోమీటర్లు .
ఇది ఒక భాగం ప్రదర్శకులకు వదిలారు . maintenance ఏమీ బాగాలేదు. టికెట్ ఉంది కాని లోపలంతా దుమ్ము ధూళీ , ఏవీ వివరంగా లేవు . ఆ కోట చరిత్ర లేదు . అయితే ఈ కోట మరీ పాతది కాదు -1750 లోనే కట్టారుట . అయితే లోపల కోర్ట్ యార్డ్ బాగుంది . మాతో పాటు చూడాడనికి వచ్చిన ఒక విద్యార్థి ఆ maintenance చూసి బాధ పడ్డాడు . తను అన్నాడు ఇంతకంటే చూడవల్సింది దీనికి దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్స్ అని . వాటర్ ఫాల్ ? అదెక్కడా అని అడిగితే -- అయ్యో అది చూడలేదా ? చందౌలి అని వారణాసి కి 60 కి దూరంట . ఇంకా అయిదారు ఉన్నాయిట --60, 65 కి దూరంలో . అంత ఓపిక లేదు .
బయటకు రాగానే దిలీప్ లస్సి laced with కోవా ఇచ్చాడు . భలే రుచిగా ఉంది . అంత తినాలంటే భయం పైగా తీపి అలవాటు తప్పింది . ఇష్టమున్న వారు మాత్రం మిస్ అవకూడదు . అక్కడే ఫొర్ట్ ముందు ఫొటొ అంటూ వెంటబడి డబ్బులు తీసుకుని -- పైగా మూడూ కాపిలు -- ఒక అలుక్కుపోయిన , భయంకరమైన ఫోటోలు కవర్లో పెట్టి ఇచ్చాడు . కారులోకి ఎక్కాక చూసుకున్నాము . అయినా పాపం మాలాంటి వాళ్ళు ఉంటేనే కదా వాళ్ళూ బతికేది !
ఇక చివరి ప్రోగ్రాం ! అప్పటికే నాలుగు రోజులైంది . మల్లాది సూరిబాబు గారు ఆయన వ్యాసం లో దీక్షితుల వారు కాశీ లో శ్రీ చక్రం ప్రతిష్టించి దానిపై ఒక శివ లింగం ప్రతిష్టించారని విన్నాను . అక్కడ ఆయన ఒక ఆరు నెలలు ఉన్నారుట . ఆ తరువాతే గురువుగారి ఆదేశం పై సుబ్రహ్మణ్యు న్ని దర్శించుకుని ఉపాసన చెయ్యడం అంతా జరిగిందిట . అది చూడాలని ! అక్కడ ఎవరూ తెలియదు అన్నారు . భగవంతుడి లీలో ! కాకతాళీయమో ! పొద్దునే మల్లాది శ్రీ రాం ప్రసాద్ వేరే పని మీద ఫోన్ చేసారు . అప్పుడు ఈ గుడి గురించి అడిగాను . వెంటనే అక్కడ BHU లో ఉన్న మృదంగ విద్వాన్శునికి ఫోన్ చేసి , ఆ గుడి పూజారి గారిని కలిపారు . ఆయన రాం నగర్ ఫోర్ట్ నుంచి దగ్గర అని అటు దారి చెప్పారు . అది హనుమాన్ ఘాట్ దగ్గర ఉందిట . ఒక సందు వరకు వెళ్ళాక అక్కడి నుంచి నడవాలి . ఆయన శిష్యుని పంపి లోపలకి తీసుకు వెళ్ళారు . చిన్న గుడి . అందులొనే పూజరుల నివాసం . కాశీ లోని ఎన్ని వందల లింగాలలో ఒకటి కాని మనకి అది ముఖ్యం . అక్కడ భార్గవి దీక్షితార్ కృతి ఒకటి పాడింది . అక్కడనుండి తృప్తిగా బయట పడ్డాము . మర్నాడు ప్రయాణం . వారణాసి జిలేబి తెచ్చాడు దిలీప్ . అది ఎంతో రుచిగా ఉందిట . నేను తినలేదు .ఆ రాత్రి అందరం ఒకే రూము లో కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకున్నాము . మర్నాడు ప్రయాణం ముందు మాకు వేడిగా జిలేబి , పాన్ కావలని అడిగాము . పొద్దున్నే అవి తీసుకుని దిలీప్ వచ్చాడు . మా అమ్మకి జిలేబి ఇష్టం , పాన్ ఇష్టం . నాకూ పాన్ ఇష్టం . బిల్స్ సెట్టిల్ చేసి మెల్లగా వెనక్కి బయలుదేరాము . అప్పుడు నిజంగా బెంగ అనిపించింది . ఈ నాలుగు రోజులు కాశీ లో స్నేహితులతో హాయిగా గడిచింది .
విమానం టైముకి వచ్చింది . ఆ ప్రయాణం లోనే విమానం packed గా ఉండడం , మా పక్కన కూర్చున్న ఆయన వలన కలిగిన అసౌకర్యం వల్ల భార్గవి ఇబ్బంది పడింది . హైదరాబాద్ లో దిగగానే హమ్మయ్య అనుకున్నాము . ముందే బుక్ చేసుకున్న కార్ రావడం మేము ఇంటి ప్రయాణం మొదలు పెట్టాము. అప్పటికే రెండు దాటిందని చౌటప్పల్ దగ్గర విలేజ్ ఫూడ్ లో భోజనం చేసాము . ఎనిమిదింటికల్లా విజయవాడ వచ్చేసాము . భార్గవి పామర్రు వెళ్ళి పోయింది .
ఇదండీ మా కాశీ యాత్ర . కింద నిమ్మి చెప్పినట్లు దిలీప్ నంబర్ కావలంటే ఇస్తాను . అతనికి తెలుగు రాదు . కొంచం ఇంగ్లీష్ వచ్చు . కాని మంచి వాడు . జాగ్రత్తగా అన్నీ చూపాడు .
ఒక ప్రయాణం ఒక జీవితానుభవం . మన గురించి మనకు తెలియజేసే ఒక పాఠం ! కాశీ అందులో ఒక ప్రత్యేక అనుభవం .
స్వస్తి