Thursday, June 1, 2023

America kaburlu-3

 అమెరికా కబుర్లు -3

రొటీన్ నెమ్మదిగా నడుస్తోంది . నేను ఒంటరిగా వెళ్ళడానికి మంచి ప్రదేశాలు ఆలోచించి " అమ్మా, ఇక్కడకి దగ్గర్లోనే ఒక మంచి పుస్తకాల షాపు వుంది, వెళతావా ? " అని అడిగాడు . ఎగిరి గంతేసాను ( నిజంగా కాదండోయి) .
మా ఇంటి నుంచి ఇరవై నిమిషాల నడక. ఫోన్ లో జి.పి.యస్ . పెట్టుకుని బయలు దేరాను . ఎండ ఎండ అని భయపడతారు కాని బెజవాడ వాళ్ళం ఈ ఎండ ఒక లెఖ్ఖా? మా అబ్బాయి మాత్రం ఆ ఎండ వేరు , ఈ ఎండ వేరు అని సన్ స్క్రీన్ రాయించి , నల్ల కళ్ళద్దాలు పెట్టించి పంపాడు.
రోడ్డు అటు ఇటు మలుపులు ఎక్కువ లేవు . తిన్నగా వెళ్ళాను . షాపు బాగుంది . లోపలకి అలాగే వెళ్ళి ' ఏమిటో సరిగ్గా కనిపించటం లేదు ' అని అనుకున్నాక వాళ్ళు నా కేసి చూసిన చూపుకి అర్ధం అయింది నేను అద్దాలు మార్చలేదని. అసలు అలవాటు లేక పోతే ఇదే ఇబ్బంది . మాములు అద్దాలు పెట్టుకుని చూసాను. ' కనపడుతోంది ! కళ్ళకేం కాలా!' 😳😀
ఎక్కువ పుస్తకాలు లేవు కాని అన్ని రకాలు వున్నాయి . రెండు అంతస్ధులు . ఏ సెక్షన్ కి ఆ సెక్షన్ విడిగా వుంది . ప్రతి అరలోను స్టాఫ్ కొన్ని పుస్తకాలను పరిచయం చేస్తూ చేత్తో రాసిన స్లిప్లు వున్నాయి . 'స్టాఫ్ రికమెండేషన్ ' అని . అది బాగుంది. అలా అన్ని ముఖ్యమైన జోనర్సకి వున్నాయి . వెళ్ళాక కొనకుండా ఎట్లా? ఓ నాలుగు కొన్నాను. అందులో ఈ మథ్యే విక్టరీ సిటి చదివానేమో , అందులో ఒకటి రష్దీది . Essays.
తెలీకుండా ఒక గంట అయిపోయింది . ఆకలి మొదలయింది. పొద్దున్న తిన్న దోసెలు అరిగి పోయాయి . మళ్ళీ వెనక్కి బయలుదేరాను. ఆ( ఏముంది వచ్చిన తోవే కదా అని ఈ సారి జి. పి.యస్ పెట్టుకోలేదు . సగం దూరం బాగానే వచ్చాక అక్కడ రెండు రోడ్లు . ఇందులో ఏది? బుద్ధిగా ఫోన్ తీసి డైరక్షన్ పెట్టి , అది కూడా సరిగ్గా అర్ధం కాక తప్పు దోవలో రెండు అడుగులు వేయగానే ఫోను కుయ్యో అంది . అప్పుడు సరియైన తొవకి వచ్చి ఇల్లు చేరాను .
సాయంకాలం వాటర్ ఫ్రంట్ . మేముూ వస్తామన్నారు కొడుకు , కోడలు .




No comments:

Post a Comment