అమెరికా కబుర్లు -4
కిందటి సారి మిస్ అయిన వాటిలో ఇది ఒకటి. వాటర్ ఫ్రంట్ పార్క్.
ఊబర్ తీసుకుని బయలుదేరాము. ఆ డ్రైవరు ఏ దేశస్ధుడో , ఎక్కిన దగ్గర నుంచి మాట్లాడుతూనే వున్నాడు - మాతో కాదు - ఫోన్లో. అయితే మెల్లగా . మన దేశంలోలా గట్టిగా మాట్లాడడం లేదు.
పొటోమాక్ west virginia లో పుట్టి మధ్య లో ఎన్నొ నగరాలు దాటుకుంటు వాషింగ్టన్ డి.సి . మీదుగా ముందుకు వెళ్తుంది . మన నదులు బట్టి చూస్తే చిన్న కాలవ లా ఉంది . అంటే ఈ ఊళ్ళో అలా ఉండి ఉండవచ్చు . ఇంతకు ముందు ఆ పరివాహక ప్రాంతం కి అటు ఇటు సిమెంట్ తో కాంక్రీట్ చేసేసారుట . తరువాత పాలకులకు తెలివి వచ్చి ఆ సిమెంట్ అక్కడక్కడ వుంచి మిగతా అంతా చెట్లూ , మొక్కలు , గడ్డి పెంచారు . కూచోడానికి బెంచీలు వున్నాయి . ఈ రోజు రంజాన్ కనుక పిల్లలు తీసుకుని , చక్కగా ముస్తాబై వచ్చారు . గ్రీన్ టీ , టపియోకా , లిచ్చి ల తో చల్లటి టీ తీసుకుని అక్కడకి చేరుకున్నాము . అందులో బోట్ రైడింగ్ కూడా వుంది . మేము వెళ్ళి నప్పుడు కొంత మంది అమ్మాయిలు మన కేరళ బోట్ rowing లాంటి దానికి ట్రైన్ అవుతున్నారు . అలా రెండు గ్రూపులు వున్నాయి . కాసేపు కూర్చుని , అటు నుంచి నడుచుకుంటూ వెళ్ళి కాస్త షాపింగ్ , సరుకులు కొనుక్కుని బయలుదేరాము. ఏ దేశమైనా ఇవి తప్పవు .
దారిలో మయన్మార్ విషయమై ఆ దేశస్థులనుకుంటాను ఏవో స్లోగన్లు అరుస్తూ నిల్చున్నారు . పాపం వారి భయం తల్చుకుంటే బాధ అనిపించింది . పవర్ , రాజకీయం -- ఈ రెండు ఎంత భయంకరమైనవి !!
అక్కడ ఒక ఆకు పచ్చ సైకిల్ చైన్ వేసి వుంది . మా అబ్బాయి దాన్ని చూపి ' దీని అర్థం ఇక్కడ ఒకరు సైకిల్ మీద వస్తూ ఉంటే ఆక్సిడెంట్ అయ్యి చని పోయాడని గుర్తు . ' ఈ వూరు సైకిల్ తొక్కే వారికి ఫ్రెండ్లీ గా ఉండదుట . ఎన్నో దుర్మరణాలు . అందుకే కొంత మంది ఈ విధం గా తమ నిరసన తెలియజేస్తున్నారుట .
మా అబ్బాయి మొదట్లొ ఆఫిస్ కి సైకిల్ మీద వెళ్ళేవాడు . ఆ రోడ్డు కూడా చాలా బిజి రోడ్డు . ఇప్పుడు తల్చుకుంటే భయం వేసింది . ఇప్పుడు మెట్రోనే !
ప్రతి దేశం లోనూ ఏవో మంచి చెడు . రోడ్లు ఖాలిగా వుంటాయి . కార్లు పద్ధతిగా నడుపుతారు అనుకుంటూ వుంటే భయ్యిమని చప్పుడు చేసుకుంటూ కారు దూసుకు పోతు కనిపించింది . ఇట్టాంటి వారు ఏ దేశం లోనైనా ఒకటే ! ' అందరూ మమ్మల్ని చూడండహో ! నా కారు గొప్పది ! నేను యంగ్ ! నేను స్పీడు గా పోగలను !'
ఇదీ మెస్సేజ్ . నవ్వుకుని , జాలి పడడమే -- వాడు అమెరికన్ అయినా , ఇండియన్ అయినా ! ఏమంటారు ?
అన్నట్లు పొటొమాక్ దగ్గర పిచుకలు కనిపించాయి . మన దేశివాళి లా వున్నాయి . ఇక్కడా అవేనా ? లేక మన దేశం నుంచి పారిపోయి ఇవీ ఇక్కడకు వచ్చాయా ? లేక వీళ్ళేమైనా ఎత్తుకు వచ్చారా ? ఏమైనా చెయ్యగలరు ---అమెరికన్లు కదా !


No comments:
Post a Comment