Thursday, June 1, 2023

america kaburlu

మెరికా ప్రయాణం -- కొన్ని కబుర్లు -1
ఏమిటో ఈ మధ్య అందరూ గుంటూరు వెళ్ళినట్లు అమెరికా వెడుతున్నారు ' అని అమరేంద్ర గారు అన్నట్లు , ఇటీవల కాలంలో అమెరికా వెళ్ళడం అమలాపురం వెళ్ళినంత తేలిక అయింది .
అందుకే నేను ఎక్కువ వివరాలు చెప్పను. కొన్ని సంఘటనలు రాస్తాను .
నాలాంటి వారికి ప్రయాణానికి కావల్సింది మానసిక preparation ( దీనికి తెలుగు మాట వెంటనే తట్టలేదు). 22 గంటల ప్రయాణం , కూర్చోవడం , నిద్ర లేక పోవడం , అంతా ఒక శిక్ష లా వుండకుండ వుండాలంటే కావల్సింది ఇది . అందులో ఒక సారి వెళ్ళి వచ్చాక ముందే ఊహిస్తాము . కాని నా అనుభవం -- ఎప్పుడు ఊహించింది జరగదు .
ఈ సారి కాళ్ళు చాచుకుని పడుకునే అవకాశం దొరకలేదు . చుట్టూ తెలుగు వారు తక్కువ మంది వున్నారు . నా పక్కన ఒక ఆఫ్రికన్ అమెరికన్ కూర్చున్నాడు. మంచి వాడు , చిన్నవాడు . విండో దగ్గర ఒక జర్మన్ . ఎక్కిన దగ్గర నుండి ఆ అబ్బాయి కదల లేదు . అలానే కూర్చున్నాడు . నాకైతే చెప్పాలని అనిపించింది ' లేచి నడు నాయనా ' అని .
దిగాక నేను భార్గవి వీల్ చెయిర్ బుక్ చేసుకున్నాము . తను ఎక్కువ దూరం నడవ లేదు, నేను ఈ మెడ , చెయ్యి నొప్పితో సామాను మోయ లేను అని ఉద్దేశం. నా బండి తోసే మనిషి బంగ్లాదేశ్. గలగల మాట్లాడుతూనే వున్నాడు . నాకు ఇండియా , పాకిస్ధాన్ , బంగ్లాదేశ్ వాళ్ళు వస్తే ఆనందంగా వుంటుంది - ఎంతైనా మన వాళ్ళు కదా ' అన్నాడు . పరాయి దేశంలో మనం అంతా ఒకే లానే కనిపిస్తాం. చిన్న చిన్న తేడాలు కనిపించవు . ద్వేషాలు వుండవు కదా అని అనిపించింది . రెండు ఎక్కువ ప్రశ్నలు చెకింగ్ దగ్గర అడిగితే - బయటకు రాగానే ' ఆ ఆఫిసరు అంతే నాకు నచ్చడు . అందుకే నేను అందరితో మాట్లాడుతాను కాని ఈయన తో కాదు . ఏదో అమెరికా అంతా ఈయనే కాపాడేస్తునట్లు ఫీల్ అవుతాడు ' అన్నాడు . పరవాలేదు , ఆయన డ్యూటి ఆయన చేసాడు అని అంటే వూరుకున్నాడు . లైన్లో నిల్చునప్పుడు బోర్ కొట్టకుండా 'సాజన్ ' సినిమాలో పాటలు పెట్టాడు. 😁
అలా బయటకు వచ్చి ఇంటికి చేరాము .

No comments:

Post a Comment