Friday, April 22, 2022

రజనీ ఒక నివాళి

 పొద్దున్నుంచి పరంపరగా వస్తున్న నివాళులు మనస్సు కి తృప్తి నిచ్చాయి . రజని గారు పోయి ఇవ్వాళ్టికి నాలుగు సంవత్సరాలు .

 అఫ్సర్ గారు తన నివాళి లో రాసినట్లు భావ గీతాల తుఫాను లో కూడా తన స్వరం వినిపించగలిగారు రజని . అతి పిన్న వయస్సు నుండి పాటలు రాసారు రజని . అవి వుత్తి మాటల మాలలు కాదు . భావాల లోతులున్నాయి . ప్రతి భావాన్ని ఒక చిత్రం లా మన ముందు ఉంచారు . ఈ దృశ్యం ఆయన్ని కదలించింది అని పక్కన ఉన్న మనకు తెలియదు , పాటైతే తప్ప . 

మధ్యలో ఆయన పూషా పేరుతో రాసిన కవితలు చాలా వేరుగా వుంటాయి . నేను అడిగాను -- మీరు ఇలాగే రాసి వుంటే ఈ తరానికి ఇంకా ఎక్కువ మందికి తెలిసే వారేమో ! అని . ఆయన అది నా స్వభావానికి సరిపోదు . నేనూ రాయగలను అని నాకు నేను చెప్పుకోవడానికే . అందుకే మానేసాను అన్నారు . 

ఇక ఆయన స్ఫృశించని పాటల ప్రక్రియ లేదు . లాలి పాటలు , చిన్న పిల్లల పాటలు , నృత్య గీతాలు , సినిమా గీతాలు , అనువాదాలు లలిత సంగీతం అన్నీ ప్రక్రియలలో తనదైన ముద్ర వేసారు . కాని అన్నిటి కంటే నాటకీయత పాటలలో ఆయనకి ఎక్కువ ఇష్టమేమో అనిపిస్తుంది .నృత్య గీతాలు , కూచిపూడి నృత్య నాటకాలు ఆయనకి చాలా ఇష్టమైన ప్రక్రియ. ఆయన వాద్య బృందాలలో కూడా కనిపించేది అదే . అది ఆది కావ్యావతరణ అయినా ,మాటలతో పాటలతో పిల్లల కోసం రాసిన కొండ నుండి కడలి దాకా అయినా , సంస్కృతం లో రాసిన మేఘ సందేశం అయినా అదే నాటకీయత కనపడుతుంది .అంతెందుకు -- ఒహో ఒహో ప్రతి శ్రుతి అనే పాటలో ' ఒంటరైన బాటసారి ఓ యన ఒహొ యన ' అదే నాటకీయత కనపడుతుంది . పద చిత్రాలు , నాటకీయత , సంగీతం ఆయన పాటని మళ్ళీ మళ్ళీ వినేలా చేస్తాయి . 

 రజనీ ఛాందసులు కాదు . అలా అని మన సంస్కృతి మీద అపారమైన ప్రేమ ఉన్నవారు . దేముడి మీద భక్తి ఉంది . ఏ మాత్రమూ భయం లేదు . అందుకే పూజ చెయ్యక పొతే ఎలా అని ఒక ritual కి కట్టుబడరు . శ్రీ కృష్ణం శరణం మమ రాస్తున్నప్పుడు ఆయన భగవద్గీత ఎలా పాటలో పెడతారా చూడాలని చాలా ఆసక్తి ఉండేది . ఆయన అవి రాసిన పది రోజులు శ్రీ కృష్ణ నామం జపం చేసారు , స్నానం చేసి , మంచం మీద కూర్చుని తన మనస్సంతా ఆ రూపం పై లగ్నం చేసారు . మనం చూస్తే కూర్చుని నిద్ర పోతున్నరని అనుకుంటాము . వచ్చిన వారితో మాములుగా మాట్లాడేవారు . అది రాయడం అయి పోయాక నేను ఎలా సాధ్య పడింది అంటే పై విషయం చెప్పారు . అయితే సంగీతం ఆయనది కాదు , నృత్యం గీతం కనుక ఆ భగవద్ గీత లోని అందం , సంపూర్ణత్వం మనకి విడిగా తెలియదు .

ఆయన పాట మాట వేరుగా రావు . అందుకే ఆయన సాహిత్యానికి ఆయన సంగీతమే మాకు నచ్చుతుంది . అలా అని అది ఆయన సొంతం అనుకోరు . ఉదాహరణకు రావు బాలసరస్వతి గారు పాడిన ' విరహానలంపు బాధ అది వారి ట్యూన్ . నాకు ఇదారి ట్యూన్ వినే మహదవకాశం దొరికింది . అది ఇక మళ్ళీ ఎవరికీ , ఎప్పుడూ సాధ్యపడదేమో . అప్పుడు ఈ స్మార్ట్ ఫోనులు లేవు , వరే పరికరాలూ లేవు . ఇక సూరి బాబు గారు చేసిన ' హాయిలో నేల ఎద కింత హింసా ' . నేను వారిని వారి ట్యూన్ అడిగాను . ఇది విన్నాక అది మర్చి పోయాను అన్నారు . సుధాకర్ గరు చేసిన నును మంచు సోనలో ' ఇవన్ని చాలా బాగుంటాయి . అది రజనీ గారు విని సంతోషించేవారే కాని నాపాట నా బాణి అని అనుకునే వారు కాదు . మరో మధురమైన పాట ' పృధయా సాంధ్య సమీర లాస్యం ' మంచాల జగన్నాధ రావు గారి  సంగీతం , పి. బి. శ్రీనివాస్ గారి గొంతులో ! ఎన్ని పాటలో ఎన్ని పాటలో చాలా పాటలు నాకు తెలియనవి వున్నాయి . ఎవరైన చెపితే విని చాలా సంతోషిస్తాను . ఆయన 17-18 ఏట మొదలు పెట్టి దాదాపు 80 ల దాక రాసారు . ఎన్ని పాటలు ఉండి వుంటాయి ! 

వారి సున్నితమైన పరిశీలన శక్తి , కొత్తదనాన్ని ఆహ్వానించడం , ఒప్పుకోవడం , ఆనిందచడం , అందరిని ఒకేలా చూడడం ఆయన్ని ఒక మహా మనీషిని చేసాయి . ఏదైనా విషయం గురించి మాట్లాడుతూ వుంటే అది అప్పుడు ఆయన బుర్రలో తిరుగుతున్న విషయం . దాని గురించి ఒక కొలిక్కి వచ్చేదాక అదే మాట్లడాతారు . ఆయన్ని దాని ఒప్పుకోమని కాదు, మన తో చర్చిస్తున్నారు . అందులో లోపం వుంది అంటే సర్దుకుంటారు . అలా చెప్పాలి అంటే భట్టు గారో V.A.K . రంగారావు గారో అయ్యి  వుండాలి . ఆయనకి  చివరిలో  కలిగిన  అసంతృప్తులలో అది ఒకటి . ఆయన భాష అర్థం చేసుకునే వారే తగ్గి పోయారు . రవి కృష్ణ గారు వచ్చి మాట్లాడితే ఆయన గొంతులో ఆనందం . పరచూరి శ్రీనివాస్ గారంటే విపరీతమైన అభిమానం . పారనంది గారంటే ఎంతో ఇష్టం . ఆయన ఎవరి నిస్కృమణ అయినా సమదృష్టి తో స్వీకరించారు . నేను ముగ్గురు వ్యక్తులు పోయినప్పుడు ఏడవడం చూసాను - మా అత్తగారు , అంతకు ముందు ఉషశ్రీ గారు , ఆ తరువాత బాలమురళి గారు. ఆ రోజంతా ఆయన్ని వదిలి పెట్టలేదు . నాకు ఆయన గురించి తెలిసింది చాలా తక్కువ  . ఆయన మీద భక్తే తప్ప విషయ పరిజ్ఞానం లేదు . అయినా చెప్ప వల్సింది చాలా వుంది అనిపిస్తోంది . ఆయన మాకు ఇచ్చిన ఆస్తే ఆయన కృషి వల్ల సంపాదించిన పేరు ప్రతిష్టలు . అవి ఎక్జడకు వెళ్ళినా మాకుదీవెనెలు గా వుంటాయి . 

No comments:

Post a Comment