Tuesday, April 19, 2022

Emotions recollected in Tranquility-3

 పొద్దున్నే ఆరింటికి గుడి దగ్గరకు చేరాము . ఇదీ కాశి అంటే . ఇరుకు సందులు , అడుగడుకి ఒక గుడి , జనం , జనం . ఆరు కనుక బళ్ళు లేవు . అంటే ఊళ్ళో జనం లేరు . ఉన్నదల్లా మా లాంటి యాత్రికులు . ఇంతకీ మేము వెళ్ళింది కాలభైరవుడి గుడికి .

   కాశీ విశ్వనాధుని చూసే ముందు ఈ కాలభైరవుణ్ణి పర్మిషన్ అడగాలిట . ఆయన కాశీ కీ కోత్వాలు లాగ . నేను ప్రయాణం ప్లానింగ్ లో మా వియ్యపురాలు రాజేష్ రాణి ఖండూజా తో ఈ విషయం చెపితే ఆమె ' అయ్యో మాకు తెలియలేదు . కిందటి సంవత్సరం వెళ్ళాము కాని ఇది ఎవరూ చెప్ప లేదు ' అని వాళ్ళు ట్రిప్ ఏర్పాటు చేసినాయనకు ఫోన్ చేసి అడిగారట . ఆయన సిగ్గు బడుతూ ఒప్పుకుని ఈ సారి రండి ఏర్పాటు చేస్తాను అన్నారుట . ఆయనే మాకు ప్లాన్ చేసింది .

       కాల భైరవును గుడి చిన్న గుడి . అప్పటికే పెద్ద క్యూ . మేమూ పూల సజ్జ , అందులో ఒక ప్లాస్టిక్ కవరులో కొంచం నూనె పొసి ఇచ్చారు . అది దిష్టి లాగ తిప్పి ఇస్తారుట . మా చెప్పులు ఆ దుకాణం దగ్గర వదిలి క్యూ చివర వెతుక్కుంటూ వెళ్ళాము . అలా ఒక ఫర్లాంగ్ నడిస్తే దొరికింది . మేమూ అందులో చేరాము . అది ఒక అనుభవం . మా పక్క నుంచి మోటార్ సైకిళ్ళు , సైక్కిళ్ళు మనుష్యులని తప్పించుకుంటూ వెళ్తున్నాయి . అది ఒక మంచి అవకాశం అక్కడ ఇళ్ళు చూడాడానికి . అన్నీ పురాతనమైన కట్టడాలే . ఎదురెదురు మేడల బాల్కనీలు రోడ్ల పైన ఆర్చి లా ఉన్నాయి . ఇంటి ముందు అరుగులు . అందరివి తలుపులు వేసే ఉన్నాయి . మధ్యలో ఒక గుడి . అక్కడే ఒక పాత ఇల్లు పడగొట్టి కొత్తది కట్టుకునే ప్రయత్నం . అదో ప్రపంచం . 

  అన్ని గుళ్ళలో లాగానే వెనక ద్వారం ప్రవేశాలూ ఉన్నాయి . ముందు ఒక క్షణం విసుగు , కోపం వచ్చాయి . తరువాత నవ్వు వచ్చింది . నాకే ఆ అవకాశం వస్తే వెళ్ళనా ? ఇంకోకళ్ళకి వస్తే కోపం తెచ్చుకోవడం అవివేకం . సరే . అలా లోపల కి వెళ్ళి నా ముందు ఉన్న , నిమ్మి , ప్రసాద్ గారు డబ్బులు హుండీలో వేయబోతే ఆ గుడిలో ఉన్న పూజారి , నోటి నిండా పాన్ తో 'హూ ' అని హూంకరించి ఆ డబ్బులు తీసుకుని అందులోనే వేసాడు . కొత్త ప్రదేశం . అక్కడ రీతి తెలియదు . సరే నేను దణ్ణం పెట్టుకుని సజ్జ ఇస్తే అది దేవుడు దగ్గర బెట్టి మళ్ళీ వెనక్కి ఇచ్చారు . నూనె ఏమి ముట్టుకోలేదు . ఆ పక్కన ఒక కర్రకి నెమలి పించం కట్టుకుని వచ్చిన వాళ్ళని కొడుతున్నాడు . డబ్బులు అడుగుతున్నాడు . లైన్లో కుడి వేపు మేము , ఎడమ వేపు భార్గవి విడి పోయాము . తనకి ఈ కొట్టించుకోవడం వెనక కథ తెలుసుట . అందుకని తను కొట్టించుకుంది . మేము చెయ్య లేదు . 

    ఏమా కధ ? మనం చేసిన పాపాలకి కాలభైరవుడు ఆ నరకంలో కొరడాతో శిక్షిస్తాడుట . ఆ శిక్ష తప్పించుకోవాలి అంటే ఇక్కడ కొట్టించుకోవాలిట .

మనిషి మనస్సు ఎంత విచిత్రమైనదో కదా !! తప్పు అని తెలిసి చెయ్యడం . మళ్ళీ లోపల భయం మన మెదడుని తిననీకుండా ఒక solution వెతికేయడం . 

ఇంక బయటపడి గడియారం చూస్తే ఏడో , ఏడుంబావో అయ్యింది . పొద్దున్నే టీ నీళ్ళు నేను , కాఫి నీళ్ళు భార్గవి తాగి బయలుదేరాము కదా ఆత్మ రాముడు నేనున్నాను అని గొడవ మొదలు పెట్టాడు . ఇక్కడ అక్కడ ఎందుకు , మళ్ళీ హోటల్ కి వెళ్ళి breakfast చేద్దాము అని బయలుదేరాము . తరువాత అంతా పది తరువాతే ప్రయాణం అని . మళ్ళీ అంత దూరం ఎందుకూ అంటే -- రూం తో పాటు breakfast free 😁అందుకు .

మరి వెనక్కి వెళ్ళి కాస్త తిని ఒక అరగంట రెస్ట్ తీసుకుని ఇక ఊరి మీద పడ్డాము . ఈ లోపల దిలీప్ మమ్మల్ని గుడి బయట వదిలి మీరు వెళ్ళండి అనేసరికి మాకు అనుమానం మొదలైంది . ఇలా చేస్తే ఇంక విశేషాలు ఎలా తెలుస్తాయి అని . అప్పుడు ఈ ఊళ్ళో ఇంకా ఎవరు తెలుసు అనుకుని మొదలు పెడితే -- ప్రసాద్ గారి కోడలకి తెలిసిన వ్యక్తి , మా కంపెని రిప్రజెంటేటివ్ -- ఇలా గుర్తుకు వచ్చారు . ఇంతలో బండ్ల మాధవరావు గారి ఫోన్ . కాశీ లో ఉన్నారుటగా --BHU కి వెళ్ళండి అని . BHU మా ప్లాన్ లో ఉంది . తెలుగు విభాగానికి వెళ్ళమని సలహా ఇచ్చారు . సరే అనుకున్నాము . 

No comments:

Post a Comment