కాశీ యాత్ర -4
తొమ్మిదీ తొమ్మిదిన్నరకి బయలుదేరిన మేము ముందు తులసీదాస్ మానస మందిర్ కి వెళ్ళాము . ఇక్కడ స్థల పురాణం ఏమిటంటే పదహారో శతాబ్దం లో తులసీదాస్ ఇక్కడ తన రామచరిత మానస్ రాసారని . అందుకే మందిరానికి ఆ పేరు . అయితే ఈ మందిరం 1964 లో కట్టారుట . పూర్తిగా పాలారాయి తో కట్టబడి ఉంది . గోడల మీద రామచరిత మానస్ చెక్కబడి ఉంది . లోపల హనుమత్ లక్ష్మణ సీతా సమేత రామచంద్ర మూర్తి ఉన్నారు . పైన పురాణాలలోని కొన్ని ఘట్టాలు బొమ్మలు ఉన్నాయి . దానికి టికెట్ . లోపల తులసి దాస్ విగ్రహం కూడా ఉంది . మన దక్షిణ భారతం లోని విగ్రహాలకి ఉత్తర భారతం లో విగ్రహాలకి చాలా తేడా .
జనం లేరు . పది పదిహేను నిమిషాల లో బయట పడి సంకట విమోచన హనుమాన్ మందిరం కి బయలుదేరాము . ఇది తులసిదాసు కట్టారని ప్రతీతి . ఇక్కడ హనుమంతునికి దణ్ణం పెట్టుకుని ఆయన రామచరిత మానస్ మొదలు పెట్టారుట . ఇక్కడ ఒక వైపు రామ లక్ష్మణుల గుడి , ఎదురుగా ఈ హనుమంతుని గుడి . టికెట్లు లేవు కాని బాగా చెకింగ్ జరిగింది . లోపలికి ఏది తీసుకుని వెళ్ళనివ్వరు . దీనికి కారణం 2006 లో జరిగిన బాంబ్ పేలుడు . అదృష్టవశాత్తు ఎక్కువ ప్రాణ నష్టం జరగలేదు . మర్నాటి నుండి మాములుగా భక్తులు వచ్చేసారు . అక్కడవారు ఇక్కడ బాంబ్ పేలలేదు ముందుగానే కనుక్కున్నారు అన్నారు . అక్కడ క్య్యులో దర్శనం చేసుకుని అక్కడ పూజరిని ఈ విగ్రహం గురించి తెలుసుకోవల్సింది ఏమైనా ఉందా అని అడిగితే ఇది స్వయం భూ . నీకైదైనా కోరిక ఉంటే వెళ్ళి అడుగు స్వామి తీరుస్తాడు అన్నాడు . ఏ కోరిక లేక పోతే అంటే ' నీకేమి అవసరమో అది ఇస్తాడు ' అన్నాడు . ఇంతలో అక్కడికి వచ్చిన ఒక భక్తుడు , వయస్సులో 25-30 వుంటాయి -" ఆంటిజీ , మీరు ఎక్కడో నుంచి వచ్చినట్లు తెలుస్తోంది . ఆ స్వామి పిలవకపోతే మీరు ఆయన్ని చూడలేరు . అది నా స్వానుభవం ' అని ఎంతో భక్తి గా చెప్పాడు . పూజారి గారు ప్రసాదం ఇచ్చారు . అక్కడ కోరికలు తీరడానికి నూలు తాడు అక్కడ ఉన్న చెట్టుకి కట్టి ఉన్నాయి ( పురికోస). చాలా మంది అక్కడ కూర్చుని చాలీస చదువుతున్నారు .అటునుంచి రాములు వారి దర్శనం చేసుకుని మళ్ళీ క్యూలో నిల్చోని ఇంకో సారి స్వామి దర్శనం చేసుకుని బయట పడ్డాము . అక్కడ నుండి BHU దగ్గరని అటు వెళ్ళి అక్కడ ఉన్న బిర్లా మందిర్ , కాశీ విశ్వేశ్వరాలయం కి వెళ్ళాము .
ఆ ఆలయం విశాలంగా అందంగా ఉంది . మనం లోపలికి వెళ్ళి లింగాన్ని ముట్టుకోవచ్చు . అక్కడ ఆ ఆలయం ఎదురుగా మదన మోహాన్ మాలవ్య విగ్రహం ఉంది . ఆ విశ్వ విద్యాలయం అంతా ఆయన ప్రేరణ . యూనివెర్సిటీ బయట కూడా ఆయన విగ్రహం ఉంది . లోపలకి వెళ్ళగానే మంచి సంగీతము వినపడి ఆ స్వరం వెతుక్కుంటూ మొదటి అంతస్థుకి వెళ్ళాను . అక్కడ శివుని విగ్రహం ముందు కూర్చుని ఒక యువకుడు పాడాడు . అప్పుడే పూర్తి అయ్యినట్లుంది . నేను వెళ్ళి బిస్మిల్ల ఖాన్ గారి ఇల్లు ఎక్కడ అని అడిగితే అడ్రెస్సు చెప్పాడు . ఆటో లో వెళ్ళండి అని కూడా. సలహా ఇచ్చాడు .
గుడి బయట పుస్తకాల షాప్ కనిపించగానే వెళ్ళడం దారిలో చదువుకోవడానికి ఒకటి తరువాత చదవడానికి రెండూ కొని తెలుగు డిపార్ట్మెంట్ కొసం బయలుదేరాము . ఎవరూ చెప్పలేకపోతే మాధవరావు గారికి ఫోన్ చేసాము . ఆయన సూచనలతో మెల్లగా చేరాము . బూదాటి వేంకటేశ్వరులు గారు HOD. వారిని , అక్కడ ఎన్నొ సంవత్సరాలుగా ఉన్న గుంటూర్ వాస్తవ్యులు భారతులశారద గారిని , కథానికలలో సరస్వతి గురించి పరిశొధన చేస్తున్న విద్యార్థిని కలిసాము . చల్లటి వారణాసి లస్సీ తాగించారు . ఆ చోట ఎంత మంది మహామహులు తెలుగు వారు చదువుకున్నారో గుర్తు చేసుకున్నాము . 1940-50 లలో ఆంధ్ర మహిళా సభ నుండి స్త్రీలకు మెట్రిక్ పరీక్ష రాయించడానికి మా పెద్ద మామగారు వచ్చేవారు . అప్పుడు స్కూల్ చదువు వరుసగా లేకుంటే బెనారస్ మెట్రిక్ రాయడమే . ఇక పద్మరాజు గారు , కొడవటిగంటి కుటుంబరావు గారు , మొదలైన వారు చదివిన ప్రదేశం . కబుర్లు , ఫొటొలు అయ్యాక దుర్గా దేవి గుడికి వెళ్ళాము . ఎర్రటి ఎండ . చెమటలు లేవు కాని శరీరం మాడ్చేసే ఎండ . ఆ గుడి చూపడానికి ప్రసాద్ గారి కోడలు స్నేహితులు వచ్చారు . పది నిమిషాలలో దర్శనం అయ్యింది . పొద్దున కాలభైరవుడి దగ్గర మిస్ అయ్యిన నెమలి పించం దెబ్బలు ఇక్కడ పూర్తి చేసాను . ఎదురుగానే త్రిదేవ్ మందిరం . అదీ అయ్యి మెల్లగా హోటల్ కి చేరాము . ఇక సాయంకాలం గంగా ఘాట్లు , ఆరతి . రేపు . 🙏
No comments:
Post a Comment