Friday, April 22, 2022

Emotions recollected in tranquility-5

 కాశీ యాత్ర -5 

మచలతీ హుయీ హవా మే చంచం 

హమారే సంగ్ సంగ్ చలే గంగా కి లెహరే .

జమానే సే కహో అకెలే నహి హం 

హమారే సంగ్ సంగ్ చలే గంగా కి లెహరే .

గంగ మన జీవితం లో ఒక ముఖ్య భాగం . గంగ గోదావారి ని కూడా చూసాము మా కృష్ణ గంగ తో పాటు . ఇప్పుడు నిజంగా గంగని చూస్తున్నాము . ఆ ఉత్సాహంతో బయలు దేరాము . అసలు కాశీ లో దిగిన దగ్గరనుండి భార్గవి గంగ అంటూనే ఉంది . ఈ సారి ఏమనుకున్నాడో ఏమో దిలిప్ మాతో వచ్చాడు . ఆయన రాకపొతే దారి కనుక్కోవచ్చు కాని కొంచం కంగారుగా ఉండేది . మమ్మల్ని కేదార్ ఘాట్ కి తీసుకుని వెళ్ళాడు . చిన్న సందుల్లోంచి నడిచి వెళ్ళాము . ఒక చోట ఎవరింటి వాకిట్లోకో వెడుతున్నట్టు చిన్న నడవా . అందులో కొంతమంది సాధు వేష ధారులు పక్కలు పరుచుకుని పడుకుని ఉన్నారు . వారి ప్రపంచం వారిది . పక్కన నడుస్తున్న వారికేసి కూడా చూడటం లేదు . వారికున్న కొద్ది పాటి వస్తువులు మూటలు గా కట్టి కనపడుతున్నాయి . అవి దాటి ముందుకు వెడితే గంగ . అయితే గంగ ని చేరడానికి బోలేడు మెట్లు . అవి కూడా బాగా ఎత్తు . అది చూడగానే నిమ్మి , భార్గవి నీరసపడ్డారు . ఇద్దరికి కాళ్ళు నొప్పులు . ముఖ్యంగా మోకాలు . సరే తప్పదుగా మెల్లగా వెళ్దామని ఒకరికొకరం సాయం చేసుకుంటూ దిగాము . దిగే ముందు దీపాలు , పూలు ఉన్న చిన్న తట్టలు అమ్ముతున్నారు తల్లీ పిల్లలు . మమ్మల్ని చూడగానే తెలుగులో మాట్లాడడం మొదలు పెట్టారు . ముందు నేను వీరికి ఎట్లా తెలిసిందా అనుకున్నాను . తరువాత అనిపించింది -- మేము ఒకరితోఒకరం తెలుగులో కదా మాట్లాడుతుంటా అని . సరే అవి కొనుక్కుని మెల్లగా మెట్లు దిగి నావ మాట్లాడే పని దిలీప్ కి అప్పగించాము . 

అక్కడ మాములు సరంగులు నడిపే నావలు , మోటారు బోట్లు , luxury boats కూడా ఉన్నాయి . మనకి విడిగా మాట్లాడుకోవచ్చు , లేదా common పడవలు కూడా ఉన్నాయి . మేము మా వరుకే అని మాట్లాడుకున్నాము . మాములు పడవ అని నేనే అనేసాను . నాకు ఆ పడవ నడుపుతూ ఉండే తెడ్డు చప్పుడు బాగుంటుంది . నిదానం గా వెళ్ళచ్చు , మోటార్ శబ్దం ఉండదు అని ఉద్దేశం . బేరమాడి అక్కడనుండి మణికర్ణికా ఘాట్ దాక తీసుకుని వెళ్ళేటట్లు , ఆరతి చూపించేటట్లు బేరమాడుకుని బయలుదేరాము . మన మనస్సే అన్ని అనుభూతులకి మూలం కదా ! ఇన్నాళ్ళు విని విని ఉన్న గంగా నదిలో వెళ్తున్నాము అనే వాస్తవం ఆనందానిచ్చింది. 

  గంగా నదీ తీరం అంతా 80 ఘాట్లు దాకా ఉన్నాయిట . అందులో రాణీ ఘాట్ , ఇండొర్ రాణి గారు కట్టించింది , రాజ మాన్ సింఘ్ ఘాట్ ఉన్నాయి . మీరబాయి ఘాట్ దగ్గర ఆమె విధవ స్త్రీల కొరకు ఒక ఆశ్రమము కట్టించిందిట . ఇప్పుడు ఆ ఆశ్రమమూ మారి పోయింది . నారద ఘాట్ లో ఎవరూ జంట గా వచ్చి స్నానం చెయ్యరుట .ఆ జంట అనదమ్ములైనా , తండ్రి కొడుకులైనా , స్నేహితులైనా గొడవలు పడి విడి పోతారుట . నారదుడు కలహ ప్రియుడు కదా ! 

ఇక హరిశ్చంద్ర ఘాట్ అందరికి తెలుసు . ఎక్కువుగా శవ దహనం జరిగే ఘాట్ . దశాశ్వమేధా ఘాట్ . ఇక్కడే ప్రతి రోజు గంగా ఆరతి జరుగుతుంది . మున్షీ ప్రేమచంద్ ఘాట్ . కాశీ వాసులు ఆయన్ని ఎంతలా గౌరవించారో తెలిసి ఆనందించాను . ఆ ఘాట్ లో నే మెట్ల మీద కూర్చునే వారుట , అక్కడే రాసుకునే వారుట . అందుకని ఆ ఘాట్ కి ఆయన పేరు . అలా ఒక్కో ఘాట్ చూపించుకుంటూ మణి కర్ణికా చేరాము . ఎంత వద్దు అనుకున్నా వేదాంతం కలుగుతుంది . 360 రోజులు, 24 గంటలు ఎవరిదో ఒకరిది దహనం జరుగుతూనే ఉంటుంది . కాశీ మహా స్మశానం . కాశి జీవన క్షేత్రం. జీవితాన్ని , మృత్యువుని ఒకేలా చూడగలిగే శక్తి నిచ్చే క్షేత్రం ! ఇక్కడకు వచ్చాక హాయిగా పొతే పుణ్యం అనుకుంటూ మరణాన్ని కూడా భయపడకుండా ఆహ్వానించగలిగే ఊరు . అది నిజమా ? మనం కలిపించుకునే ఊహా ? అంటే ఊహే కదా వాస్తవం అయ్యేది . ఇక్కడ యమధర్మ రాజు కాదు మృత్యువుని ప్రసాదించేది , సాక్షాత్తు ఆ పరమ శివుడు . 

మణికర్ణిక నుండి దేవాలయానికి ఒక పెద్ద రాంప్ , మంచి తోవ తయారవుతోంది . గంగ లో స్నానం చేసి , ఎంత ముసలి వారైనా , మెల్లగా ఆ విశ్వనాధ దర్శనం చేసుకోవచ్చు . మేము వెళ్ళినప్పుడు మణికర్ణికా లో ఏడు శవ దహనాలు జరుగుతున్నాయి . అర్థరాత్రి 12 తరువాత శవం , అది ఎవరిదైనా సరే , బూడిద స్వామి కి తీసుకుని వెళ్ళి అభిషేకిస్తారుట ! హరిశ్చంద్ర ఘాట్ లో రెండో , మూడో ఉన్నాయి . ఇది వరకు చదివినట్లు సగం కాలిన శవాలు , మురికి -- ఇవి లేవు . గంగ శుభ్రంగా ఉంది . అయితే నీరు మంచిదేనా అంటే చెప్పలేము . కలుషితాలు , ముఖ్యంగా tanneries లో ని రసాయనక కలుషితాలు ఇప్పటి కీ కలుస్తూనే ఉన్నాయి .

అందుకే గంగ నీరు నెత్తి మీద జల్లుకోవడమే . ఇక అక్కడ నుంచి మెల్లగా వెనక్కి దశశ్వమేధ దగ్గరకు వచ్చేసరికి వలయాలుగా పడవలు . వాటి మధ్యలో మాదీ చేర్చాడు . మనకి భయంగా ఉంటుంది కాని వారు అలవాటుగా ఒకే టీం లా ఒక దాన్ని ఆనించి ఒకటి పెట్టారు . కొంచం సేపు భయం కలిగినా తరువాత వారి ధైర్యం మాకు ధైర్యం వచ్చింది . ఇంక విన్యాసాలతో ఆ సాయం సంధ్య గంగా ఆరతి చూడడం ఒక అనుభవం . అది చివరికి వచ్చాక మేము కూడా దీపాలు వెలిగించి గంగ లో వదిలాము . అంతా చూసి మెల్లగా కేదార్ ఘాట్ చేరాము . మళ్ళీ ఆ మెట్లు . ఆ పైన కేదారేశ్వరుని గుడి . అక్కడ కొంత మంది భక్తులు భజనలు చేస్తున్నారు . అది చూసుకుని మెల్లగా బయట పడ్డాము . అక్కడ ఒక లెమన్ టీ తాగాము . కొంచం మసాల కలిపి వేడిగా ఉన్న టీ భలే రుచిగా ఉంది . కాశీ లో జనం అంటే అక్కడే చూసాము . గుద్దుకోకుండా బళ్ళు ఎలా వెడుతున్నాయో నాకైతే అర్థం కాలేదు . ఇక ఎన్ని రకాల మనుష్యులో ! ఎన్ని భాషలు వినపడుతున్నాయో ! సౌత్ నుంచి చాలా మంది వచ్చారు ఈ నాలుగు రోజుల్లో అని సమాచారం అందించాడు దిలీప్ . అందరూ మా లాగా నాలుగు రోజులు ఉందామని వచ్చిన వారే కదా ! 

హోటల్ కి చేరి మర్నాడు పొద్దున్నే నాలిగింటికి విశ్వనాధ దర్శనం అని అనుకున్నాము . మా అబ్బాయి ఒక్క రోజులు ఇన్ని చూసారా ? అసలు కారు దిగారా ? అందులో నుంచే చూసి అయ్యింది అనేసుకుంటున్నారా అని వేళాకోళం చేసాడు . కాని మేము ఎంతో తాపిగా , హడావిడి లేకుండా చూసాము . 

No comments:

Post a Comment