యాత్రా స్పెషల్ !!
ఈ సారి నేను సైతం అనుకుంటూ చార్ ధాం యాత్రకి బయలుదేరాను .
అందరూ భయపెట్టారు . ' వెళ్ళగలవా ? నీ వయస్సు గుర్తు చేసుకో ' అంటూ . ఇప్పుడు వెళ్ళకపొతే అస్సలు వెళ్ళలేను అని ఆలోచన .
చిన్మయా మిషన్ వాళ్ళు ఏర్పాటు చేసిన యాత్రకి పేరు ఇచ్చేసాను . నిజానికి అనురాధ చెరుకూరి కూడా రావల్సింది . అనారోగ్యం వల్ల కాన్సిల్ చేసుకుంది .
ఆదివారం మొదటి అడుగు కింద ఢిల్లి కి ప్రయాణమయ్యాను . నాకు విజయవాడ విమానాశ్రయం అంటే - " ఏవుంది , పది నిమిషాలలో లొపలకి . ఎన్నీ గేట్లు -- 5/6 . అందరూ కనపడతూనే వుంటారు ' అని కొంచం ఆలస్యంగానే బయలుదేరాను .
తీరా వెళ్ళాక తెలిసింది - అదే సమయానికి హైదరాబాదు , బెంగళూరు ఫ్లైట్స్ కూడా వున్నాయిట . జనం . క్యూ . పైగా ముందే బయట ఫొటొ స్కాన్ . దానికి 'పెద్ద వాళ్ళకి ' ఒక సహాయకురాలు .
అన్ని అయ్యి లోపలకి వెళ్ళేసరికి బ్రేక్ ఫాస్ట్ చేసే టైం లేదు. మా గ్రూప్ లో ఎనిమిది మంది విజయవాడ నుంచే. వారికి నా లగేజ్ అప్పజెప్పి కాంటీన్ కి పరుగు. నాకు భరోసా ఇచ్చినా కాంటీన్ వాడు , బోర్డింగ్ కాల్ దాకా ఇవ్వలేదు . చివరికి ఎలాగో నాలుగు ముక్కలు నోట్లో వేసుకుని వెళ్ళాను . దేన్నీ అలా తక్కువ అంచనా వెయ్యకూడదు . పాఠం నంబర్ -1
ఫ్లైట్లో కూడా బ్రేక్ ఫాస్ట్ ఇచ్చాడు . air india అండి . ఇంకా పాతకాలపు అలవాట్లు కొనసాగిస్తున్నారు . అయితే ఆ పదర్ధాల నాణ్యత పై అందరికీ అనుమానం . అదీ తినేసాను .
డిల్లి చేరేసరికి 11.30. మా చెల్లెలి విమానం కూడా ఇంకో గంటలో వస్తుంది , ఇద్దరం కలిసి మా వియ్యపురాలి ఇంటికి వెళ్ళాలని ప్లాన్ . చుట్టాలని కలవాలి అంటే ఇట్లా ఏదో ఒక మిష ఉండాలి .
పంజాబి ఆతిధ్యం ఆనందించి కాసేపు విశ్రమించడం . డిల్లి వుందీ -- నిప్పుల కొలిమి .43 డిగ్ర్రిలు . వేడి గాలులు . చల్లని airport నుంచి బయటకు వచ్చేసరికి -- చాచి కొట్టినట్లయ్యింది .
అందుకని కూడా మా వాళ్ళ ఆతిధ్యం మరింత చల్లగా వుంది .
సాయంకాలం ఇండియా గేట్ చూద్దాము అన్నారు . సరే నని వెళ్ళాము . మీ వంకన మేము కూడా వస్తున్నాము , ఎన్నో సంవత్సరాలు అయ్యిందని వాళ్ళు . చూడడానికి చాలా ఉన్నాయి - కొత్తవి - భారత మండపం - లాంటివి . మండపం ఏమిటో ? తెలుగు వారిలా ? తాయిలమా ? ఏమో ?!
ఇంకా అవి చూడాడినికి సమయం లేదు . బయట తినేసి ఇంటికి చేరేసరికి పది. హాయిగా పడుకుని మర్నాటి ప్రయాణానికి సిద్ధమయ్యము.
నిజానికి యాత్ర 12 రోజులే -- కాని నేను 24 episodes రాస్తే ఆశ్చర్య పోవద్దేం !
ఇంక తరువాత ప్రయాణం మొదలు


No comments:
Post a Comment